ఢిల్లీలో ఒక నీతి.. హైదరాబాద్‌లో ఒక రీతా?: రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీకి దాసోజు శ్రవణ్ లేఖ

  • విదేశీ విధానాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను పాటిస్తోందన్న శ్రవణ్
  • ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి మోదీ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ నేత అన్నారని వ్యాఖ్య
  • తెలంగాణలో ట్రంప్ టవర్స్ కు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విమర్శ
కాంగ్రెస్ పార్టీ విదేశీ విధానాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ లేఖ రాశారు. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ చెప్పే జాతీయ, అంతర్జాతీయ సిద్ధాంతాలకు.. హైదరాబాద్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ‘రోడ్డు నాటకాలకు’ అస్సలు పొంతన లేదంటూ ధ్వజమెత్తారు.


"గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారూ.. నేను ఈ లేఖను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాయడం లేదు. జాతీయ స్థాయిలో ఏఐసీసీ చెబుతున్న సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా తెలంగాణలో మీ సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ప్రైవేట్ ఫ్రాంచైజీ-రాజకీయాలను బట్టబయలు చేయడానికే రాస్తున్నా" అని లేఖలో శ్రవణ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకే విధమైన నిర్దిష్ట సిద్ధాంతం ఉందా, లేక రాష్ట్రాల్లో అవకాశవాదం కోసం విలువలను తాకట్టు పెడతారా అని నిలదీశారు.


జూన్ 20న కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా విడుదల చేసిన అధికారిక ప్రకటనను శ్రవణ్ ఈ లేఖకు జతచేశారు. ఆ ప్రకటన ప్రకారం... గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం 'ఇండియా ఫస్ట్' కాకుండా 'పీఆర్ ఫస్ట్' (ప్రచారం కోసం)లా సాగిందని కాంగ్రెస్ ఆరోపించిందని శ్రవణ్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం కోసం మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టారని, ట్రంప్ భారత్‌ను చిన్నచూపు చూస్తూ ‘ఆదేశాల భాషలో’ మాట్లాడుతున్నారని, ఆయన ముందు మోదీ మోకరిల్లడం 140 కోట్ల మంది భారతీయులకు సిగ్గుచేటని ఢిల్లీలో కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించిందని చెప్పారు.


ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ట్రంప్‌ను అంతలా విమర్శించిన కేవలం మూడు రోజులకే.. అంటే జూన్ 23న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే డొనాల్డ్ ట్రంప్ కోసం హైదరాబాద్‌లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారని శ్రవణ్ విమర్శించారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో, యూఎస్ కాన్సులేట్ పక్కనే... కాంగ్రెస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 'డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూ'ను అధికారికంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోందని అన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాజకీయ ద్వంద్వ నీతిని మీరు ఎలా సమర్థిస్తారంటూ రాహుల్ గాంధీని శ్రవణ్ సూటిగా ప్రశ్నించారు.


Dasoju Sravan
Rahul Gandhi
Revanth Reddy
Donald Trump Avenue
Telangana Congress
BRS Politics

More Telugu News